SATHEE: గేట్‌, నీట్‌ రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ‘సాతీ’ ఈ-లెర్నింగ్‌ పోర్టల్ ప్రారంభం​

దేశంలోని విద్యార్థులందరికీ సమాన స్థాయిలో విద్య అందట్లేదు. ముఖ్యంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు కొంతమంది పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుండగా, మరికొంతమందికి కనీస వివరాలు అందుబాటులో ఉండట్లేదు. యూపీఎస్‌స్సీ (UPSSC), గ్రూప్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ సహకారంతో కొన్ని సంస్థలు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నాయి. కానీ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం మాత్రం అలాంటి ఏర్పాట్లు లేవు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్రం ‘సాతీ’ (SATHEE) పేరుతో ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకచ్చింది.

సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్’ అనేది దీని పూర్తి పేరు. ప్రధానంగా జేఈఈ (JEE), నీట్‌ (NEET) అభ్యర్థుల కోసం ఈ లేటెస్ట్ ఈ-లెర్నింగ్ పోర్టల్‌ను తీసుకొచ్చినా, మిగిలిన వారికి సైతం ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మార్చి 6న సాతీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ఈ-లెర్నింగ్ పోర్టల్.. అన్ని రకాల పోటీ పరీక్షలకు అభ్యర్థులు సొంతంగా సిద్ధమయ్యేలా ఉపయోగపడుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ చెబుతున్నారు. JEE, NEET పరీక్షల కోసం ప్రధానంగా దీన్ని రూపొందించారు. అధికారిక వెబ్‌సైట్‌లో గూగుల్‌ ఫారం ద్వారా అభ్యర్థులు తమకు కావాల్సిన సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : కొనసాగుతున్న యూజీసీ నెట్ పరీక్షలు.. ఫైనల్ ఫేజ్ పరీక్షల తేదీలు ఖరారు..

  • యూజీసీ ఆధ్వర్యంలో..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (MoE), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) కాన్పూర్ ఆధ్వర్యంలో ఈ ప్లాట్‌ఫామ్‌ను తయారుచేశారు. ఐఐటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ వంటి పేరొందిన విద్యాసంస్థల్లోని ప్రొఫెసర్లు తయారు చేసిన వీడియోలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీన్ని నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుండగా, అభ్యర్థులు ఉచితంగా వీటిని వినియోగించుకోవచ్చు. ఇంగ్లీష్‌, హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోని మెటీరియల్‌ ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

  • వారికి ఎంతో ఉపయోగం

కొవిడ్‌ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ టైంలో JEE, NEET అభ్యర్థుల కోసం కేంద్రం విద్యాశాఖ ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్ట్ అభ్యాస్ (NTA)ను ప్రారంభించింది. ఇంటి దగ్గర సొంతంగా సిద్ధమయ్యేందుకు ఇది ఎంతో ఉపయోగపడింది. అలాగే వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు, రిమోట్‌ ఏరియాల్లో ఉన్నవారికి నీట్‌, జేఈఈలకు కోచింగ్‌ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

ప్రధానంగా అలాంటి వారి కోసం సాతీ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదొక ఇంటరాక్టివ్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌. యూపీఎస్‌సీ (UPSC) వంటి ఉద్యోగ పరీక్షలు, క్యాట్‌ (CAT), గేట్‌ (GATE) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు